బెంగళూరు: బీజేపీ నేత హత్య కేసులో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి బెంగళూరులోని ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. యోగీశ్గౌడ గౌడర్ అనే నేత హత్య కేసులో ఎమ్మెల్యేతో పాటు మరో 16 మందికి కూడా శిక్ష విధించడమే కాక, రూ.16 లక్షల జరిమానా కట్టాలని, ఆ మొత్తాన్ని బాధితుని పిల్లలకు అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
బీజేపీ జిల్లా పంచాయతీ సభ్యుడైన యోగీశ్గౌడ గౌడర్ను 2016, జూన్ 15న కొందరు ధార్వాడ్లో హత్య చేశారు. తర్వాత ఈ కేసును 2019లో సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా వినయ్ కులకర్ణిని పేర్కొంటూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ సమయంలో కులకర్ణి జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు.