Jairam Ramesh : కేంద్రం (Union Govt) 30 కోట్ల మంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీదారుల (Policy holders) సేవింగ్స్‌ను దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ పార్టీ (Congress party) తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ (Adani group) కు ప్రయోజనం చేకూర్చేందుకు సామాన్య పౌరుల జీవితకాల సేవింగ్స్‌ను కేంద్రం దుర్వినియోగం చేసిందని మండిపడింది.
ఎల్ఐసీతో అదానీ గ్రూప్‌లో బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని ఆరోపించింది. దీనిపై పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం లేదా అదానీ గ్రూప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 30 కోట్ల మంది ఎల్ఐసీ పాలసీదారుల పొదుపు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అదానీ గ్రూప్‌లో పెట్టుబడులుగా పెట్టించి.. ఎలా దుర్వినియోగం చేసిందనే విషయానికి సంబంధించిన పలు విషయాలు ఇప్పుడే వెలుగులోకి వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు.
2025 మేలో అదానీ గ్రూప్‌కు సంబంధించిన కంపెనీలలో సుమారు రూ.33 వేలకోట్ల ఎల్ఐసీ నిధులను పెట్టుబడి పెట్టడానికి భారత అధికారులు ప్రతిపాదనను రూపొందించి, ముందుకు తీసుకెళ్లారని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ ప్రైవేటు సంస్థను సమస్యల నుంచి బయట పడేసేందుకు ఎల్ఐసీ నిధులను వినియోగించడానికి ఆర్థిక మంత్రిత్వశాఖ, నీతి ఆయోగ్‌లకు ఏ అధికారం ఉందని ఆయన ప్రశ్నించారు.