న్యూఢిల్లీ, అక్టోబర్ 27: బీరులో ఆల్కహాల్ శాతాన్ని బట్టి ఎక్సైజ్ డ్యూటీ విధించాలన్న కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై బీరు అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీర్లను వర్గీకరిస్తూ వాటిపై 35శాతం వరకు పన్నులు పెంచాలన్న ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని బీఏఐ కోరింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వల్ల బీర్ల ధరలు అనూహ్యంగా పెరిగే అవకాశముందని, సామాన్యులకు అందుబాటులో ఉండవని సీఎం సిద్దరామయ్యకు బీఏఐ లేఖ రాసింది. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ప్రభావితమవుతుందని, రాష్ట్ర ఆదాయం రూ.400 కోట్ల వరకు పడిపోతుందని పేర్కొన్నది. బీరు తయారీ కంపెనీల రూ.5వేల కోట్ల పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కర్ణాటకలో బీర్లన్నింటిపైనా ఒకే విధమైన ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. అలా కాకుండా, ఆల్కహాల్ శాతాన్ని బట్టి బీర్లను మూడు రకాలుగా విడగొట్టాలని, ఎక్సైజ్ డ్యూటీని మూడు విధాలుగా(రూ.10, రూ.16, రూ.20) విధించాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పేర్కొన్నది.