లక్నో: లక్నోలో ఓ పెండ్లి వేడుకలోకి చిరుతపులి ప్రవేశించటంతో హాజరైన వారంతా హాహాకారాలు చేస్తూ తలోదిక్కుకు పరుగెత్తారు. అందరూ భోజనం చేస్తుండగా, వధూవరులు ఫొటోలు దిగుతుండగా..చిరుతపులి వారి ముందు ప్రత్యక్షమైంది. పరుగు అందుకున్న వధూవరులు కారులో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆహ్లాదం.. కోలాహాలంతో నిండిన మ్యారేజ్ హాల్లో పరిస్థితి తారుమారైంది. పోలీసులు, అటవీ శాఖ అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఫంక్షన్ హాల్ మొదటి అంతస్థులో చిరుతపులిని సిబ్బంది పట్టుకోగలిగారు. ఈ ప్రయత్నంలో అటవీ శాఖ అధికారి భుజాన్ని చిరుత పంజాతో గాయపర్చింది.