Unemployment | హైదరాబాద్, సెప్టెంబర్ 26: దేశంలో ప్రైవేటు ఉద్యోగి జీవితం దినదిన గండంగా మారుతున్నది. ఎంత పెద్ద కంపెనీ అయినా ఉద్యోగానికి గ్యారెంటీ లేకుండా పోతున్నది. లాభాలు లేవనో, ఖర్చులు తగ్గించాలనో, ఏఐతో ఉద్యోగుల అవసరం తగ్గిందనో ప్రతీనెలా పదుల సంఖ్యలో కంపెనీలు వేలాది మందికి లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. గతంలో చదువు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు దొరకకపోవడం, చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించకపోవడమే భారత్‌లో సమస్యగా ఉండేది. ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నా ఏ సమయాన లేఆఫ్ జాబితాలో ఉంటామో అనే బెంగ ఉద్యోగులను కలవరపరుస్తున్నది. ఒక్కమాట చెప్పాలంటే.. ఇప్పటివరకు జాబ్‌లెస్ ఇండియాగా ఉన్న మన దేశంలో ఇప్పుడు జాబ్‌లాస్ ఇండియాగా కొనసాగుతున్నది. మరోవైపు దేశంలో నిరుద్యోగుల కష్టాలూ తీరడం లేదు. చదువుకు తగ్గ ఉద్యోగాలు లేక గిగ్ వర్కర్లుగా మారుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటున్నది. ఐఐటీల్లో చదివిన వారికి సైతం ఉద్యోగాలు దొరకడం లేదు. దేశంలోని అనేక పెద్ద కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నా.. ఆ సంస్థలు కల్పించే కొత్త ఉద్యోగుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. యువతకు కొత్త ఉద్యోగాలు దొరక్కపోవడం, ఉద్యోగాలు చేస్తున్న వారిలో అభద్రతాభావం అన్ని రంగాల్లోనూ ప్రభావం చూపిస్తున్నది.
దేశంలో ఐటీ రంగంలోని ఉద్యోగులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2023 ఆరంభంలో మొదలైన లేఆఫ్‌ల సీజన్ ఇప్పుడు తీవ్రంగా మారింది. లేఆఫ్స్.ఎఫ్‌వైఐ డాటా ప్రకారం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 445 కంపెనీల్లో 1,37,460 మంది ఉద్యోగుల కొలువులు పోయాయి. ఇందులో భారతీయుల వాటానే అధికం. అనేక బహుళ జాతి సంస్థలు ఖర్చులు తగ్గించుకునేందుకు లేఆఫ్‌ల బాట పడుతున్నాయి. అయితే, పెద్ద కంపెనీలు ప్రకటించే లేఆఫ్‌లు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. చిన్న సంస్థలు నిత్యం వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నప్పటికీ ఈ లెక్కలు బయటకు రావడం లేదు. అనేక కంపెనీలు 30 రోజుల గడువు ఇచ్చి కొత్త ఉద్యోగం చూపుకోమని సూచిస్తూ ‘సైలెంట్ లేఆఫ్’ చెప్తున్నాయి. ఈ లెక్కలు బయటకు రావడం లేదు. సహజంగా ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారినప్పుడు వేతనంలో ‘హైక్’ అడిగే పద్ధతి ఉంది. ఇప్పుడు మాత్రం ఏదో ఓ ఉద్యోగం దొరికితే చాలనే భావనతో అనేకమంది ప్రస్తుతం పొందుతున్న దాని కంటే తక్కువ వేతనానికి కూడా ఉద్యోగంలో చేరుతున్నారు. చాలామందికి కొత్త ఉద్యోగాలు దొరకక ఖాళీగా ఉండాల్సి వస్తున్నది.
దేశంలోని అనేక సంస్థలు ప్రతియేటా లాభాలను, వ్యాపారాన్ని పెంచుకుంటున్నా.. ఉద్యోగుల సంఖ్యను మాత్రం పెంచడం లేదు. వివిధ రంగాల్లో వ్యాపారాలను విస్తరించిన టాటా, రిలయన్స్, అదానీ, బజాజ్, ఏవీ బిర్లా, మహీంద్ర ఇలా అన్ని కంపెనీలదీ ఈ విషయంలో ఒకే తీరు. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పొలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆరు సంస్థలు రెవెన్యూను 7.3 శాతం, లాభాలను 22.3 శాతం, మార్కెట్ కాపిటలైజేషన్‌ను 43.8 శాతం పెంచుకున్నాయి. అయితే, ఈ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య మాత్రం పెరగకపోగా 0.2 శాతం తగ్గింది. ఈ ఆరు గ్రూప్‌లకు కలిసి 69 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. బ్లూమ్‌బర్గ్ డాటా ప్రకారం.. వీటిల్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 17.4 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 17.3 లక్షలకు తగ్గింది. ఇటీవల దేశంలోని 1,196 కంపెనీలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక సర్వే చేయగా ఈ సంస్థల్లో ఉద్యోగ కల్పనలో వృద్ధి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5.7% ఉండగా, 2023-24లో కేవలం 1.5% మాత్రమే ఉంది. ఈ కంపెనీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3,33,000 కొత్త ఉద్యోగాలు వస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 90,840 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి.
చదువు పూర్తి చేసుకున్న యువతకు ఉద్యోగాలు లభించడం ఏటేటా కష్టంగా మారుతున్నది. గతంలో ఐఐటీల్లో చదివితే క్యాంపస్ రిక్రూట్మెంట్లోనే కచ్చితంగా మంచి ఉద్యోగం లభిస్తుందనే భరోసా ఉండేది. ఇటీవలి కాలంలో ఈ నమ్మకం కూడా పోతున్నది. దేశంలోని 23 ఐఐటీల్లో దాదాపు 8 వేల మంది విద్యార్థులకు ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు లభించలేదని లెక్కలు చెప్తున్నాయి. 2024లో ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం 21,500 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 13,410 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. ఐఐటీల్లో చదివిన వారి పరిస్థితే ఇలా ఉంటే మిగతా విద్యాసంస్థల్లో పట్టభద్రులైన వారికి ఉద్యోగాలు లభించడం మరింత కష్టంగా మారింది. చాలామంది యువతకు చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకక ఏదో ఒక పని చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు.
ఐఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు(2024లో) క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు నమోదు
చేసుకున్న వారి సంఖ్య: 21,500
ఉద్యోగాలు పొందిన వారు: 13,410
ఉద్యోగాలు లభించని వారు: 8,090
2