Indian Army | శ్రీనగర్, నవంబర్ 3: లష్కరే తాయిబాకు చెందిన అగ్ర కమాండర్ ఉస్మాన్‌ను శనివారం భద్రతా దళాలు హతమార్చాయి. అయితే అతడిని హతమార్చడం అంత సులభంగా సాధ్యం కాలేదు. వారు 9 గంటల పాటు ప్రణాళిక వేసి ఎలాంటి పౌరనష్టం జరగకుండా విజయవంతంగా ఆపరేషన్‌ను ముగించారు. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న శ్రీనగర్‌లోని కన్యర్ అనే నివాస ప్రాంతంలో ఉస్మాన్ ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. దాడికి ముందు భద్రతా దళాలకు అక్కడ ఉన్న వీధి కుక్కలు పెద్ద సమస్యగా మారాయి.
వీరు అక్కడికి చేరితే కుక్కలు వీరిని చూసి అరుస్తాయి. అలా చేస్తే ఉగ్రవాదులు అప్రమత్తమవుతారు. దీంతో వారు అవి అరవకుండా వాటికి బిస్కెట్లు వేసి మచ్చిక చేసుకున్నారు. దీంతో వీరు అక్కడకు చేరినా అవి అరవకపోవడంతో వారు అక్కడికి చేరుకున్నారు. తెల్లవారుజామున జరిపే ఫాజర్ ప్రార్థనలకు ముందే భద్రతా సిబ్బంది అక్కడి 30 ఇండ్లను చుట్టుముట్టారు. భద్రతా దళాలపై ఉస్మాన్ ఏకే 47, గ్రనేడ్, పిస్టల్ వంటి ఆయుధాలతో ఎదురుదాడి జరిపినా దానిని సమర్ధంగా తిప్పికొట్టారు. కాల్పుల సమయంలో కొన్ని గ్రనేడ్లు పేలి ఒక ఇంటికి నిప్పంటుకోగా, అది మిగతా ఇండ్లకు వ్యాపించకుండా అధికారులు నిరోధించారు.