Rohini Acharya | పాట్నా : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సమాచారం. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) తరపున ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2009లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేసిన సరన్ ఎంపీ నియోజకవర్గం నుంచి రోహిణి పోటీ చేయబోతున్నారని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
డాక్టర్ రోహిణి ఆచార్య తన తండ్రి పట్ల ప్రేమ, భక్తి, అంకితభావంతో ఉంటుంది. కాబట్టి సరన్ ఎంపీ స్థానం నుంచి రోహిణి పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు అని సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల పాట్నాలోని గాంధీ మైదానంలో ఆర్జేడీ నిర్వహించిన ర్యాలీలో రోహిణి కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం బీజేపీ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ సరన్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో లాలు ప్రసాద్ ఇదే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. దాణా కుంభకోణం కేసులో 2013లో లాలూ అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆయన పోటీ చేయలేదు.
రోహిణి ఆచార్య వృత్తి రీత్యా ఎంబీబీఎస్ డాక్టర్. 2002లో సమ్రేశ్ సింగ్‌ను వివాహమాడింది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీర్. లాలూ యాదవ్ స్నేహితుడైన రాయ్ రాణ్‌విజయ్ సింగ్ కుమారుడే సమ్రేశ్ సింగ్. రాణ్‌విజయ్ సింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. ఇక రోహిణి, సమ్రేశ్ సింగ్ దాదాపు రెండు దశాబ్దాల పాటు సింగపూర్, యూఎస్‌లో గడిపారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2022లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు తన కిడ్నీని దానం చేసి రోహిణి వార్తల్లో నిలిచారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనే రోహిణి పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ, అవి నిజం కాలేదు.