Amit Shah : ఆర్జేడీ అధ్యక్షుడు (RJD chief) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అక్రమార్కులకు రక్షకులుగా ఉంటున్నారని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) విమర్శించారు. ఓటర్ల జాబితాలో అక్రమంగా చేరినవాళ్లను తొలగించవద్దని వారు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు.
బెగుసరాయ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. దేశంలో అక్రమంగా చొరబడి ఓటర్ల జాబితాల్లో పేర్లు నమోదు చేసుకున్నవారిని తొలగించాలా.. వద్దా..? అని ఓటర్లను ఉద్దేశించి షా ప్రశ్నించారు. యావత్ బీహార్‌ను ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో ఇక్కడ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) పురుడుపోసుకుందని షా ఆరోపించారు.
కానీ ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా 100 ప్రదేశాల్లో సోదాలు చేయించి పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేయించారని, అందరినీ జైల్లో పెట్టించారని అమిత్ షా తెలిపారు. మీరంతా ఆ పీఎఫ్ఐ సభ్యులను వదిలిపెట్టాలని కోరుకుంటున్నారా..? అని ఓటర్లను ప్రశ్నించారు. పీఎఫ్ఐ అనేది జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంస్థ అని, అందుకే ప్రధాని మోదీ ఆ సంస్థపై నిషేధం విధించారని తెలిపారు.
కానీ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పీఎఫ్ఐ సభ్యులను పగటి కలల్లో విహరింప జేస్తున్నారని, తాము అధికారంలోకి రాగానే మిమ్మల్ని జైళ్ల నుంచి విడుదల చేస్తామని వారికి హామీ ఇచ్చారని అమిత్ షా ఆరోపించారు. కానీ ప్రధాని మోదీ మాత్రం భారత భూభాగంపైన ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని తుడిచిపెట్టే పనిలో ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 కల్లా దేశంలో నక్సలిజం అంతం కాబోతోందని అన్నారు.