న్యూఢిల్లీ, డిసెంబర్ 14: పార్లమెంట్లో బుధవారం స్మోక్ బాంబుల ద్వారా సృష్టించిన అలజడికి ప్రధాన సూత్రధారి అయిన లలిత్ ఝాను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ ఘటన తర్వాత తప్పించుకుని తిరుగుతున్న కోల్‌కతాకు చెందిన ఈ టీచర్‌ను ఢిల్లీలో గురువారం అరెస్ట్ చేశారు. బుధవారం విజిటర్స్ పాస్ పొందలేకపోయిన లలిత్ పార్లమెంట్లో జరిగిన అలజడిని తన సెల్ఫోన్లో రికార్డు చేసి దానిని సామాజిక మాధ్యమంలో అప్లోడ్ చేశాడు. అంతేకాక కోల్‌కతాలో ఒక ఎన్జీవో నడుపుతున్న తన సహచరుడికి దాని కాపీని పంపాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, పార్లమెంట్లో అలజడి కేసులో సంబంధం ఉన్న ఆరుగురిలో ఐదుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితులపై యూఏపీఏ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో వీరికి బెయిల్ లభించే అవకాశం లేదు.
పార్లమెంటు భద్రతను ఉల్లంఘించి, బుధవారం లోక్‌సభలో చొరబడిన దుండగులు సాగర్ శర్మ, డీ మనోరంజన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కొన్ని కరపత్రాలను ఇవ్వాలనుకున్నారని ఢిల్లీ పోలీసులు కోర్టుకు గురువారం తెలిపారు. పార్లమెంటు వెలుపల పసుపు రంగు పొగ బాంబును పేల్చిన నీలం దేవి, అమోల్ షిండే వద్ద కూడా కరపత్రాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో ఒకదానిలో, ‘పీఎం మిస్సింగ్’ అని, ఆయన ఎక్కడ ఉన్నారో సమాచారం తెలిపినవారికి స్విస్ బ్యాంకు నుంచి నగదు పురస్కారం ఇస్తామని ఉందని తెలిపారు. వీరు షూస్‌ను లక్నోలో కొన్నారని తెలిపారు. వీరిని ముంబై, లక్నో తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి, దర్యాప్తు చేయవలసి ఉందని, 15 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు ఏడు రోజులపాటు మాత్రమే పోలీసు కస్టడీకి అనుమతించింది.