Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో కాషాయ పాలకులే లక్ష్యంగా విమర్శలు గుప్పించడంతో బీజేపీ నేతలు వరుసగా రియాక్టవుతున్నారు. రాహుల్‌కు దేశభక్తి లేదని, విదేశీ గడ్డపై దేశాన్ని విమర్శించడం ఆయనకు తగదని కాషాయ నేతలు మండిపడుతున్నారు. విదేశీ వేదికలపై భారత్‌ను అవమానించడం చైనాను ప్రశంసించడం రాహుల్‌కు అలవాటుగా మారిందని దుయ్యబడుతున్నారు.
ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ (లలన్) సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లలన్ సింగ్ మంగళవారం పట్నాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాహుల్ గాంధీకి దేశభక్తి లేదని, ఆయన విదేశాలకు వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారని అన్నారు. రాహుల్‌కు పరిణితి లేదని, ఆయన ఇంకా నేర్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
దేశాన్ని పాలించాలని రాహుల్ కలలు కంటున్నారని, కానీ ఆయన కలలు ఎన్నటికీ నెరవేరవని లలన్ సింగ్ ఎద్దేవా చేశారు. కాగా,వరుస ఓటముల షాక్‌తో విదేశీ పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తన అసహనం వెళ్లగక్కుతున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. విదేశీ గడ్డపై సొంత దేశాన్ని విమర్శించడం దేశభక్తి కలిగిన వారు చేయాల్సిన పని కాదని హితవు పలికారు.
Read More :
CM Revanth Reddy | తెలంగాణకు సవాల్‌గా భారీ రుణ భారం: సీఎం రేవంత్