ముంబై: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స కోసం డబ్బులు లేవు. దీంతో బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు అతడు ప్లాన్ వేశాడు. వైద్యం అందించిన ఆసుపత్రిలో బాంబు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. దర్యాప్తు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (Man Plants ‘Bomb’ At Hospital) మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. మే 13న హడప్సర్ ప్రాంతంలోని ఉషా కిరణ్ ఆసుపత్రిలో టైం బాంబు వంటి పరికరాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బాంబు స్క్వాడ్‌ను రప్పించారు. ఏడు గంటలు టైమ్ సెట్ చేసి ఉన్న బాంబు వంటి పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో ఎలాంటి పేలుడు పదార్థం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, పూణేలో కలకలం, భయాందోళన రేపిన ఈ సంఘటనపై ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో నిందితుడి కోసం గాలించారు. చివరకు నేపాల్ పారిపోయేందుకు నాగ్‌పూర్ రైల్వే స్టేషన్లో వేచి ఉన్న ఆ వ్యక్తిని ఏటీఎస్ సిబ్బంది శుక్రవారం అరెస్ట్ చేశారు.
సోలాపూర్‌కు చెందిన 35 ఏళ్ల శివాజీ రాథోడ్‌గా నిందితుడిని పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి చికిత్స కోసం రూ.7 లక్షలు అవసరమైనట్లు తెలుసుకున్నారు. ఆ డబ్బు లేకపోవడంతో చికిత్స పొందుతున్న ఆసుపత్రి నుంచి డబ్బులు వసూలుకు ప్లాన్ వేశాడని పోలీస్ అధికారి తెలిపారు. రూ.400 ఖర్చుతో పేలని బాంబును అతడు తయారు చేసినట్లు చెప్పారు. టైమర్ క్లాక్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేశాడని, డిజిటల్ క్లాక్, నాలుగు పైపులు, అంటుకునే టేపులు, రెండు వైర్లతో పరికరం తయారు చేసి ఆసుపత్రిలో ఒక చోట ఉంచినట్లు వివరించారు.
అయితే టేపు చాలక పోవడంతో సమీపంలోని షాపులో ఆన్లైన్ పేమెంట్ చేయడం ద్వారా నిందితుడు శివాజీని గుర్తించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆన్లైన్లో టైమర్ ఆర్డర్ చేసిన కొరియర్ ప్యాకేజీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతడు తయారు చేసిన బాంబు పరికరంలో ఎలాంటి పేలుడు పదార్థం లేదని తెలిపారు. ఇందులో ఎలాంటి ఉగ్ర కోణం లేదని అన్నారు.
మరోవైపు నిందితుడు శివాజీ నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. నేపాల్‌లో ఉన్న సోదరికి ఫోన్ చేశాడని, భారత్‌లో ఎండల వల్ల అక్కడకు తాను వస్తున్నట్లు చెప్పాడన్నారు. నాగ్‌పూర్ నుంచి రైలులో హౌరా చేరుకుని అక్కడి నుంచి నేపాల్ వెళ్లేందుకు అతడు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. అయితే రైలు కోసం వేచి ఉన్న అతడ్ని అరెస్ట్ చేసినట్లు వివరించారు. నిందితుడి నివాసం నుంచి రెండు కిలోల గంజాయినీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.