Kolkata Incident : బీజేపీ, బెంగాల్ వ్యతిరేక శక్తులు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో అనిశ్చితి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని టీఎంసీ నేత కునాల్ ఘోష్ అన్నారు. కోల్‌కతాలో ఘోష్ గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాషాయ నేతలపై విమర్శలు గుప్పించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆమెకు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులకు అందిన ఫిర్యాదుపై వ్యాఖ్యానించేందుకు ఘోష్ నిరాకరించారు.
ఈ విషయంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని, తమ పార్టీ అగ్ర నాయకత్వంతో పాటు తమ న్యాయవాదులు ఈ వ్యవహారంపై ఏం చేయాలో నిర్ణయిస్తారని అన్నారు. బెంగాల్లో అలజడి రేపేందుకు కాషాయ మూకలు పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. కాగా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటన అత్యంత హేయమని కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి అన్నారు.
బెంగాల్లో జరిగిన ఘటన బాధాకరం, ఈ ఘటనకు సంబంధించి స్వయంగా మహిళ అయిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తక్షణమే నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.ఇందుకు విరుద్ధంగా ఈ ఘటనను మభ్యపెట్టి నిందితులను కాపాడేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నదని అన్నారు. ఇటీవల మమతా బెనర్జీ ప్రధానికి రాసిన లేఖలో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించేలా కఠిన చర్యలు చేపట్టాలని కోరారని మంత్రి గుర్తుచేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మహిళా హెల్ప్‌లైన్ బెంగాల్లో అమలు కావడం లేదని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Saripodhaa Sanivaaram Review | సరిపోదా శనివారం.. నాని కోపం బ్లాక్ బస్టర్ కొట్టిందా..?