అటు మాస్.. ఇటు క్లాస్.. రెండు కథలూ సమపాళ్లలో చేస్తున్న హీరో నాని. దసరాతో ఓ మాస్ హిట్ కొట్టారు. తర్వాత హాయ్ నాన్నతో క్లాస్ గా అలరించారు. ఇప్పుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్ లో ‘సరిపోదా శనివారం’ చేశారు. ఇది మాస్ క్లాస్ యాక్షన్ టచ్ వున్న కాన్సెప్ట్ సినిమా. మరి ఈ కాన్సెప్ట్ లోని కొత్తదనం ఏమిటి ? నానికి ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చిందా ? రివ్యూలో చూద్దాం.
కథ గురించి: సూర్య (Nani)కి చిన్నప్పటి నుంచి విపరీతమైన కోపం. తన కోపం కారణంగా రోజూ గొడవలే. సూర్య కోపం తగ్గించడానికి తల్లి ఓ ప్రామిస్ తీసుకుంటుంది. ‘వారంలో శనివారం మాత్రమే కోపం చూపించాలి. మిగిలిన రోజులు సైలెంట్ గా వుండాలి’ ఇదీ ఆ ప్రామిస్. దీని ప్రకారం కేవలం శనివారం రోజే తన కోపాన్ని చూపిస్తుంటాడు సూర్య. తనకి కోపం తెప్పించిన వారి పేరుని చిత్రగుప్తుడిలా ఓ డైరీలో రాసి, శనివారం యముడిలా దండిస్తాడు. కట్ చేస్తే.. దయానంద్ (SJ Surya) జాలి కనికరం లేని పోలీస్ ఇన్స్పెక్టర్. తన అన్నయ్య కూర్మానంద్ (Murali Sharma)తో తనకు ఆస్తి గొడవలు వుంటాయి. ఎలాగైనా అన్నయ్య ఆస్తిని చేజిక్కించుకోవాలని చూస్తుంటాడు. తన కోపాన్ని సోకులపాలెం అనే ఊరి వాళ్ల మీద చూపిస్తుంటాడు. కోపం వచ్చినప్పుడల్లా ఆ ఊరిలో ఎవరినో ఒకరిని పట్టుకొని తప్పుడు కేసులు బనాయించి దారుణంగా కొడుతుంటాడు. అలాంటి దయ పేరుని సూర్య తన డైరీలో రాసుకుంటాడు. తర్వాత ఏం జరిగింది? దయ పేరు సూర్య డైరీలోకి ఎందుకు వచ్చింది. దయ, సోకులపాలెం జనాలనే ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ కథలో పోలీస్ కానిస్టేబుల్ చారులత (Priyanka Mohan) పాత్ర ఏమిటి? ఇవన్నీ తెరపై చూడాలి.
Click Here : “Priyanka Mohan | క్యూట్ లుక్స్‌తో మతులు పోగొడుతున్న ప్రియాంకా అరుళ్ మోహన్”
కథా విశ్లేషణ: ‘మన కోపం నలుగురిలో ధైర్యం నింపేలా వుండాలి’ ఈ మాట చుట్టూ అల్లుకున్న కథ ఇది. హీరో, ఫైనల్ గా విలన్ ని అంతం చేయడం చాలా కథల్లో చూశాం. సరిపోదా శనివారం కూడా అలాంటి అవుట్ లైన్ వున్న కథే. కానీ దర్శకుడు ఈ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్,కాన్సెప్ట్ ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతిని పంచింది. సూర్య బాల్యంతో కథ మొదలౌతుంది. తర్వాత ‘శనివారం ప్రామిస్’ సీక్వెన్స్ లో ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఒకసారి కాన్సెప్ట్ తేలిసిపోయిన తర్వాత వచ్చే సీన్స్ కొన్ని ఊహకు అందేలా వుంటాయి. అయితే రెండో అంకం.. మలుపుతో ఈ కథ మరింత రసవత్తరంగా మారుతుంది. దయపాత్రలో ఎస్జే సూర్య ఎంట్రీ, ఆయన బ్యాక్ డ్రాప్, చిన్నకొడుకు పెద్దకొడుకు కథ.. ఇవన్నీ చాలా ఆసక్తికరంగా వుంటాయి. మరోవైపు మురళిశర్మ ట్రాక్ కూడా ఈ కథలో బాగా బ్లెండ్ అయ్యింది. ఒక దశలో సూర్య వెర్సస్ మురళీశర్మ అన్నట్టుగా వుంటుంది.
హీరో, విలన్ ని కొట్టడం వెరీ కామన్. అయితే ఈ కొట్టడానికి ఓ కాన్సెప్ట్ ని జోడించి, ప్రతి క్యారెక్టర్ కథలో బాగం చేసిన విధానం బావుంది. ముఖ్యగా ఎస్జే సూర్య పాత్రని హీరోకి సమానంగా రాసుకున్నాడు వివేక్. ఆ రెండు పాత్రలని నడిపిన తీరు యాక్షన్ మూడ్ ని బాగా ఎలివేట్ చేయగలిగింది. ప్రతిసారి ఫైట్ వుండదు కానీ.. ఆ ఫైట్ మూడ్ ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేయగలిగాడు దర్శకుడు. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచేలా వుంటుంది.
మొదలు, మలుపు, ఆట విడుకు, దాగుడు మూతలు, ముగింపు అంటూ ఈ సినిమాని చాప్టర్స్ గా డివైడ్ చేశాడు డైరెక్టర్. ఇందులో మొదలు ఎపిసోడ్ లో సూర్య బాల్యం కాస్త లెంత్ అయినఫీలింగ్ కలుగుతుంది. మూపులు, ఆడవిడుపు మాత్రం ఎక్సయిటింగా వుంటాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే దాగుడు మూతలు మాత్రం కాస్త లెంత్ ఎక్కువైయింది. సన్నివేశాలని సాగదీశారు. అది ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ముగింపు మాత్రం బావుంది. ఈ సినిమా కోర్ పాయింట్ ‘మన కోపం నలుగురిలో ధైర్యం నింపేలా వుండాలి’ అనే మాటకు జస్టిఫికేషన్ ఇచ్చేలా క్లైమాక్స్ ని తీర్చిదిద్దడం బావుంది.
నటీనటులు నటన: ఎలాంటి పాత్రలోనైన సహజంగా ఇమిడిపోగలడు నాని(Nani) . సూర్య పాత్రని చాలా ఆర్గానిక్ గా చేశాడు. వారంలో ఆరు రోజులు తనది పక్కింటి అబ్బాయి లాంటి పాత్రే. శనివారం మాత్రం ఉగ్రరూపం చూపిస్తాడు. ఈ రెండు వేరియేషన్స్ సహజంగా కుదిరాయి. యాక్షన్ సీన్స్ లో తన ఎనర్జీ సూపర్ గా వుంటుంది. ఎస్జే సూర్య(SJ Surya) ఈ సినిమాకి మేజర్ ఎట్రాక్షన్. నిజానికి ఆ పాత్రలో ఆయన లేకపోతే సినిమా ఇంత పే చేసేది కాదేమో అన్నంతగా చేశాడు. తన టైమింగ్, డిక్షన్, యాక్షన్ అన్నీ భలే కుదిరాయి. విలనిజంలో కూడా చాలా చోట్ల నవ్విస్తాడు. మురళి శర్మకి కి ఇచ్చిన ‘జడ్జ్మెంట్’ మేనరిజం బాగా వర్క్ అవుట్ అయ్యింది. చారులత పాత్ర కూడా కీలకమే. ఆ పాత్రలో అందంగా, అమాయకంగా కనిపించింది ప్రియాంక (Priyanka Mohan). ఆమె పాత్రలో ఓ ట్విస్ట్ కూడా వుంది. సాయి కుమార్ కి మంచి పాత్ర పడింది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
టెక్నికల్: జేక్స్ బెజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆద్యంతం ప్రేక్షకుడిని కట్టిపడేశాడు. నేపథ్య సంగీతం ఫుల్ యాక్షన్ మోడ్ లో వుంటుంది. చాలా సీన్స్ ని బీజీఎంతో ఎలివేట్ చేశాడు. కెమెరా పనితనం బావుంది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో ఇంకాస్త షార్ఫ్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నంతంగా వున్నాయి.
ప్లస్ పాయింట్స్
నాని, ఎస్జే సూర్య, మురళీశర్మ
కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే
నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ లో కాస్త సాగదీత
రేటింగ్: 3/5