కోల్‌కతా: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన కోల్‌కతా హత్యాచార బాధితురాలైన ట్రైనీ డాక్టర్ శవపరీక్షను ఆర్జీ కర్ హాస్పిటల్లోనే నిర్వహించారు. (RG Kar Hospital) అక్కడి డాక్టర్లు, మృతురాలి తండ్రి డిమాండ్ మేరకు ఆమె విధులు నిర్వహించిన మెడికల్ కాలేజీలోనే పోస్ట్‌మార్టం జరిగిందని పోలీస్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 9న రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్‌పై అత్యాచారంతోపాటు హత్య జరిగింది. సంచలనం రేపిన ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది.
కాగా, బాధిత జూనియర్ డాక్టర్ మృతదేహానికి ఆర్జీ కర్ హాస్పిటల్లో ఎందుకు పోస్ట్‌మార్టం నిర్వహించారన్న దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిష్పక్షపాతంగా ఉండేందుకు మరో హాస్పిటల్లో పోస్ట్‌మార్టం ఎందుకు నిర్వహించలేదని కొందరు జూనియర్ డాక్టర్లు ప్రశ్నించారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకే అరెస్టైన మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ప్రభావంతో బాధితురాలి సొంత మెడికల్ కాలేజీలోనే పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
మరోవైపు ఈ ఆరోపణలను ఖండించే పత్రాలను సీబీఐ సంపాదించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పోస్ట్‌మార్టానికి ముందు జూనియర్ డాక్టర్లు, బాధితురాలి తండ్రి ఐదు డిమాండ్లు చేశారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పర్యవేక్షణలో, మహిళా డాక్టర్ల సమక్షంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోనే పోస్టుమార్టం నిర్వహించాలని, వీడియో రికార్డ్ చేయాలని కోరారు. లిఖితపూర్వక డిమాండ్లను ఆగస్టు 9న అప్పటి ప్రిన్సిపాల్‌కు సమర్పించారు. బాధితురాలి తండ్రి, మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు వైద్యులు దీనిపై సంతకం చేశారు. అవుట్‌పోస్ట్ పోలీసుల ద్వారా డీసీపీకి ఈ లేఖను పంపారు.
కాగా, నిరసన చేసిన వైద్యుల డిమాండ్ల మేరకు ఆర్జీ కర్ హాస్పిటల్లోనే ట్రైనీ డాక్టర్ మృతదేహానికి శవపరీక్ష జరిగిందని కోల్‌కతా పోలీస్ ఉన్నతాధికారి ధృవీకరించారు. ఈ ప్రక్రియను వీడియో రికార్డ్ చేయడంతోపాటు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పర్యవేక్షించినట్లు తెలిపారు. అయినప్పటికీ పోస్టుమార్టం ప్రక్రియలో చిత్తశుద్ధిని కొందరు జూనియర్ డాక్టర్లు ప్రశ్నించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే ఈ లెటర్ బయటకు రావడంతో జూనియర్ వైద్యుల తీరుపై టీఎంసీ నేతలు కూడా అనుమానం వ్యక్తం చేశారు.
Letter Rg Kar