Kolkata Doctor Case | పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితమైన ప్రదేశం కాదని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. సమాసంలో మహిళలకు గౌరవప్రదమైన స్థానం ఉండేలా పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నారు. ప్రస్తుతం మహిళలు భయపడుతున్నారని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఆర్జీ ఖర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ఘటనపై ఆయన స్పందించారు. బాధితురాలి తల్లి మనోభావాలను తాను గౌరవిస్తానన్నారు. రక్షా బంధన్ సందర్భంగా రాజ్భవన్లో మహిళా నేతలు, వైద్యులతో గవర్నర్ సమావేశమయ్యారు. బెంగాల్లో ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని.. ఇది ఇకపై కొనసాగదన్నారు. మన ఆడబిడ్డలను, సోదరీమణులను కాపాడుకుంటామని ప్రమాణం చేయాలన్నారు. మహిళలు సంతోషంగా, సురక్షితమని భావించే సమాజం ఉండాలన్నారు.
ఇదిలా ఉండగా.. బీజేపీ నాయకుడు షాజాద్ పూనావాలా బెంగాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మమతా బెనర్జీ ఎప్పుడు రాజీనామా చేస్తారన్న ప్రశ్న నేడు తలెత్తుతున్నదన్నారు. ఈ విషయంపై ఎవరు గళం విప్పినా మమతా బెనర్జీ ప్రభుత్వం వారికి నోటీసులు పంపి బెదిరించడం చూస్తున్నామన్నారు. పోలీసులు వైద్యులను పిలుస్తున్నారని.. తమ నేతలు సైతం స్వరం పెంచినా వారిని కూడా పిలుస్తున్నారన్నారు. ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ సైతం ఈ ఘటనపై విచారణకు డిమాండ్ చేస్తే.. కోల్కతా పోలీసులు జమన్లు జారీ చేశారన్నారు. సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రభుత్వం సంస్థాగత, వ్యవస్థాగత విధానాన్ని అవలంభించిందన్నారు. ఈ విషయంపై బెంగాల్ ప్రభుత్వంపై కోల్కతా హైకోర్టు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిందని.. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంపై దృష్టి సారించిందన్నారు. మమతా బెనర్జీకి సీఎంగా కొనసాగే హక్కులేదని విమర్శించారు.