China Manja | మకర సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. మాంజా నుంచి తప్పించుకోబోయి ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌కు చెందిన రెహాన్ రహీమ్ షేక్ (35) తన భార్య రెహానా, పదేళ్ల కుమార్తె ఆయేషాతో కలిసి బుధవారం తన ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు. అతను చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే ఆకస్మాత్తుగా ఒక పతంగి దారం ( మాంజా ) వారికి అడ్డుగా వచ్చి బైక్‌కు చుట్టుకుంది. దాన్ని చేతితో తొలగించే క్రమంలో అదుపుతప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టి, 70 అడుగుల ఎత్తు ఉన్న ఆ ఫ్లైఓవర్ నుంచి కిందపడిపోయారు. కింద నిలిపి ఉన్న ఓ ఆటోరిక్షాపై వారు పడ్డారు.
ఈ ప్రమాదంలో రెహాన్, ఆయేషా అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన రెహానాను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి రెహానా కూడా కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ప్రజలు గాలిపటాల మాంజాతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిషేధిత చైనా మాంజాను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.