Rammohan Naidu | ప్రధాని నరేంద్రమోదీ క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు చేరారు. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మోదీ సర్కార్ కొలువు దీరింది. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ ద్వారా వీడియో సందేశం పంపారు.
‘ఈ ఆనందానికి కారణమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆశీస్సులు ఎల్లవేళలా నాపై ఉన్నాయి. ఆయన ఆశీర్వాదమే నన్ను ముందుకు నడిపిస్తున్నది. నాకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ ప్రోత్సహిస్తున్న మా అధినేత చంద్రబాబు నాయుడు, సోదర భావంతో చూస్తున్న లోకేశ్, జన సేన అధినేత పవన్ కల్యాణ్, నరేంద్రమోదీ, ముఖ్యంగా నా బాబాయి అచ్చెన్నాయుడుకు ధన్యవాదాలు. మా కుటుంబ సభ్యులు ఎన్నో త్యాగాలు చేసి నేను మూడుసార్లు గెలవడానికి కారణమయ్యారు. నేనీ స్థాయిలో ఉండటానికి మరో ప్రధాన కారణం మా శ్రీకాకుళం ప్రజలు. నాపై మీరు చూపుతున్న ప్రేమాభిమానాలు ఎంత వరకు వచ్చాయో ఈ రోజు అందరూ చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుతున్నా
`నాకు లభించిన ఈ మంత్రి పదవి ఆంధ్రప్రదేశ్ ప్రజలదని మరోసారి గుర్తు చేస్తున్నా. మా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు వచ్చే ఐదేండ్లలో పూర్తి చేసేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున శక్తి వంచన లేకుండా పని చేసి మీకందరికీ న్యాయం చేయడానికి, రాష్ట్రాభివృద్ధికి కష్ట పడతాం. ఏపీని అభివృద్ధి పటంలో నిలిపి, దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారు చేయడమే మా అందరి లక్ష్యం’ అని పేర్కొన్నారు. 2014లో తొలిసారి శ్రీకాకుళం నుంచి పార్లమెంట్ కు ఎన్నికైన రామ్మోహన్ నాయుడు, 2019లోనూ గెలుపొందారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు.