Khalistani terror : దేశానికి ఇప్పుడు మరో ఉగ్ర ముప్పు తయారైంది. ఖలిస్తాని ఉగ్ర సంస్థలు దేశానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లలో ఖలిస్తాని ఉగ్రసంస్థలు దాడులు చేసే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్లలోని దేవాలయాలు, ప్రజలు ఎక్కువగా ఉండే రద్దీ ప్రదేశాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా విభాగం తెలిపింది. ప్రధానంగా ఇక్కడి దేవాలయాలు, మత పరమైన ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రభుత్వ సంస్థలు, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఈ హెచ్చరికలో నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అలర్ట్ కొనసాగిస్తున్నారు. ఒక అనుమానాస్పద ఈ మెయిల్‌ను అధికారులు అందుకున్నారు. అందులో ఈ టార్గెట్ల గురించి ప్రస్తావించారు. ఈమెయిల్‌ను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు, ఉత్తరాఖండ్ పోలీసులకు అధికారులు సమాచారం అందించారు. దీంతో వారు ఆయా ప్రదేశాల్లో అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా పెంచారు. అలాగే, ఈమెయిల్‌పై విచారణ జరుపుతున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది.. ఇందులో ప్రస్తావించిన అంశాల్లోని నిజానిజాలు ఎంత అని ఆరా తీస్తున్నారు. ఇటీవలే ఉత్తరాఖండ్‌లో నిహంగా సిక్కులకు, పోలీసులకు మధ్య వివాదం తలెత్తింది. ఒక ఘర్షణకు సంబంధించి నలుగురు నిహంగ్స్ను పోలీసులు అరెస్టు చేయడంతో వారిని విడుదల చేయాలని కోరుతూ నిహంగ్స్ సిక్కులు ఆందోళన చేస్తున్నారు.
పంజాబ్ నుంచి ఖలిస్తాన్ అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలంటూ కొందరు సిక్కులు కొన్నేళ్లుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ వేర్పాటువాద ఉద్యమానికి మద్దతుగా పుట్టుకొచ్చిన కొన్ని సిక్కు సంస్థలు ఉగ్రవాద సంస్తలుగా రూపాంతరం చెందాయి. ఇండియాతోపాటు అమెరికా, కెనడా, ఇతర యూరప్ దేశాల్లో పలు సంస్థలు ఇలా పని చేస్తున్నాయి. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ), ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ (కేసీఎఫ్) వంటి సంస్థలు వాటిలో కొన్ని.