Kerala Education : విద్యారంగంలో ముందుండే రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్న కేరళ.. మరో కీలక మార్పు దిశగా అడుగులేయబోతుంది. పదో తరగతి విద్యార్థులపై అకడమిక్ భారాన్ని తగ్గించేందుకు 25 శాతం సిలబస్ తగ్గించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కేరళలోని కొల్లాంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి వి.శివకుట్టి ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమలవుతుందని ఆయన వెల్లడించారు.
విద్యార్థులపై ప్రస్తుతం సిలబస్ ఎక్కువగా ఉండటంతో ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సిలబస్ తగ్గించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు అక్కడి ప్రభుత్వాన్ని చాలాకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నిపుణుల సూచన మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి సిలబస్‌ను 25 శాతం తగ్గించనున్నారు. ఇందుకు సంబంధిత కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న సిలబస్‌లో 25 శాతం తగ్గుతుందని, అయితే, కంటెంట్ మాత్రం మారకుండా చూసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించాలని, ఒత్తిడి తగ్గించాలనే లక్ష్యంతోనే, విశాల దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ అందిస్తామన్నారు.
మరోవైపు సిలబస్ తగ్గించడం ద్వారా విద్యావ్యవస్థ బలహీనమవుతుందంటూ, ప్రమాణాలు దెబ్బతింటాయంటూ కొందరు నిపుణులు, పేరెంట్స్ చేస్తున్న వాదనను మంత్రి తప్పుబట్టారు. అలాంటి వాదనలో నిజం లేదని, ఏ సిలబస్ తొలగించినా జాగ్రత్తగా, బాధ్యతగా చేస్తామన్నారు. సిలబస్‌లోని కీలక, మూల అంశాల్ని తొలగించబోమన్నారు. అయితే, ప్రతి స్తాయిలో ఏ అంశం మరోసారి రాకుండా చేయడం ద్వారా సిలబస్ తొలగిస్తామని హామీ ఇచ్చారు. దీనివల్ల పిల్లలపై పరీక్షల ఒత్తిడి తగ్గుతుందని వ్యాఖ్యానించారు.