తిరువనంతపురం: దేశంలో ఒమిక్రాన్ విజృంభిస్తున్నది. ఆదివారం పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. కేరళలో 45 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 152కు చేరింది. తాజా కేసులలో తొమ్మిది మంది అధిక ప్రమాదకర దేశాల నుంచి తిరిగి వచ్చారు. 32 మంది తక్కువ ప్రమాదకర దేశాల నుంచి వచ్చినట్లు వారి ట్రావెల్ హిస్టరీ ద్వారా తెలిసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయిన నలుగురికి కూడా ఈ కొత్త వేరియంట్ సోకినట్లు చెప్పింది.
మరోవైపు కేరళలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 2,802 కరోనా కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 48,113కు చేరింది. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం మొత్తం మరణాలకు మరో 66 మరణాలు కలిపినట్లు కేరళ ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం 19,180 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది.