తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గకపోయినా.. రోజువారీ కొత్త కేసుల సంఖ్య మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇవాళ కొత్తగా 12,161 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య మాత్రం 17,862గా నమోదైంది. అంటే కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల కంటే రికవరీల సంఖ్య 5,700 ఎక్కువగా ఉన్నది. గత మూడు రోజులుగా కూడా పాజిటివ్ కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి.
అంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నది. కరోనా మరణాలు ఇవాళ కూడా 100కు పైనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 155 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 24,965కు పెరిగింది. ప్రస్తుతం కరోనా మరణాలు, రికవరీలు పోను 1,43,500 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో 90,394 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.