ఎర్నాకులం, డిసెంబర్ 9: పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసేముందు కనీసంగా ఒక ఏడాది వేర్వేరుగా ఉండాలని నిర్దేశించే విడాకుల చట్టం-1869లోని క్రిస్టియన్లకు వర్తించే సెక్షన్ 10ఏను కేరళ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. తప్పనిసరి నిర్దిష్ట గడువును నిర్దేశిస్తున్న ఈ నిబంధన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నదని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నది. హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.
విడాకుల కోసం దంపతులు రెండేండ్లు విడివిడిగా ఉండాలని పేర్కొనే విడాకుల చట్టంలోని ఇంతకుముందటి నిబంధనను 2010లో ఓ కేసులో ఏడాదికి తగ్గించిన ఇదే కేరళ హైకోర్టు.. తాజాగా పూర్తిగా రద్దు చేయడం గమనార్హం. ‘దంపతుల మధ్య వైవాహిక విభేదాలను కోర్టు సాయంతో పరిష్కరించేలా చట్టం ఉండాలి. ఒకవేళ పరిష్కారం సాధ్యం కాని పక్షంలో ఆయా దంపతులకు ఏది మంచిదో నిర్ణయించేందుకు కోర్టుకు చట్టం అనుమతించేలా ఉండాలి’ అని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొన్నది. ఓ జంట విడాకుల కేసు సందర్భంగా కోర్టు పై ఆదేశాలు ఇచ్చింది.