కొచ్చి : ప్రజా ప్రయోజనాల కోసం మీడియా సంస్థలు చేసే స్టింగ్ ఆపరేషన్లు చట్టబద్ధమేనని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎవరైనా వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని అవమానించడానికి దురుద్దేశంతో చేసే స్టింగ్ ఆపరేషన్లకు చట్టం మద్దతు ఉండదని స్పష్టం చేసింది. నిజాన్ని వెలికితీసి, ప్రజలకు చేర్చాలనే ఉద్దేశంతో స్టింగ్ ఆపరేషన్ చేస్తే విచారణ నుంచి మినహాయింపు ఉంటుందని కోర్టు పేర్కొన్నది. 2013లో సోలార్ కుంభకోణం కేసులో ఇద్దరు రిపోర్టర్లు పతనంథిట్ట జిల్లా జైలుకు వెళ్లి నిందితుడి స్టేట్మెంట్ను చాటుగా రికార్డు చేశారు. దీంతో వారిపై జైళ్ల చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసును కొట్టేస్తూ కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ పై వ్యాఖ్యలు చేశారు. పాలకుల్లో జవాబుదారీతనం తీసుకురావడం, అధికార దుర్వినియోగం, తప్పులు చేయకుండా చూసే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్‌కు ఉంటుందని న్యాయమూర్తి అన్నారు.