Rajendra Vishwanath Arlekar | తిరువనంతపురం, ఏప్రిల్ 12: శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లకు కాల పరిమితిని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అతి స్పందనగా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభివర్ణించారు. బిల్లులను ఆమోదించడం వంటి అంశాలపై పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియచేయకుండా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నిరవధికంగా పెండింగ్‌లో ఉంచడాన్ని చట్ట వ్యతిరేక, ఏకపక్ష చర్యగా సుప్రీంకోర్టు తన తీర్పులో తప్పుపట్టడం గురించి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్లేకర్ మాట్టాడుతూ నిర్దిష్ట కాల వ్యవధిలో గవర్నర్ బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని అన్నారు.
తమిళనాడు గవర్నర్‌పై డీఎంకే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించి ఉండాల్సిందని ఆయన సూచించారు. గవర్నర్లకు నిర్ణీత కాల వ్యవధిని నిర్దేశించడం రాజ్యాంగ సవరణ పరిధిలోకి వస్తుందని, ఇక న్యాయస్థానమే రాజ్యాంగ సవరణ కూడా చేస్తే అసెంబ్లీలు, పార్లమెంట్ అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును అతి స్పందనగా ఆయన అభివర్ణించారు. “కొన్ని కేసులు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉంటాయి. అందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వారి కారణాలు వారికి ఉంటాయి. కొన్ని బిల్లులను క్లియర్ చేసేందుకు సమయం పట్టవచ్చు. అందుకు గవర్నర్‌కూ తన కారణాలు తనకు ంటాయి” అని అర్లేకర్ వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం కేరళపై ఏమాత్రం ఉండబోదని, తన వద్ద ఎటువంటి బిల్లులు పెండింగ్‌లో లేవని అర్లేకర్ పేర్కొన్నారు. తనకు ముందు కేరళ గవర్నర్‌గా పనిచేసిన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు మధ్య విభేదాలు ఉన్న విషయాన్ని గురించి ప్రశ్నించగా తనకు ముఖ్యమంత్రితో సత్సంబంధాలు ఉన్నాయని, ఏవైనా వివాదాస్పద అంశాలు ఉంటే కూర్చుని చర్చించుకుంటామని అర్లేకర్ వివరించారు.