Kerala Elections : కేరళ (Kerala) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో తాము విజయం సాధిస్తే.. ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కోటా కేటాయిస్తామని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) గురువారం పార్టీ మ్యానిఫెస్టో (Manifesto) ను విడుదల చేశారు. విస్తృత సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యంగా 60 పాయింట్లతో రెండు వాల్యూమ్లుగా దీన్ని రూపొందించారు. కాగా 140 స్థానాలున్న కేరళలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి.
నెలవారీ పింఛన్ రూ.3 వేలకు పెంచనున్నట్లు మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అత్యంత పేదరికంలో ఉన్న ఐదు లక్షల కుటుంబాలను ఆదుకుంటామని, బలహీన వర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, వృద్ధులకు, మంచానపడిన రోగులకు మెరుగైన సంరక్షణ అందిస్తామని, చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లు కల్పిస్తామని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ ప్రోగ్రామ్లు విస్తరిస్తామని, ‘బ్యాక్ టూ క్యాంపస్’ పేరుతో ఉద్యోగంలేని వారికి నైపుణ్యాలు అందిస్తామని,
50 శాతం ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తామని తెలిపారు.
మహిళలు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా సురక్షిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. శిశు సంరక్షణ, నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించడం, విద్యావంతులైనవారు చేపట్టే వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలు అందించడం లాంటివి కూడా మ్యానిఫెస్టోలో ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, సంక్షేమ పింఛను రూ.3,000 కు పెంపు, కాలేజీ విద్యార్థినులకు రూ.1,000 లాంటి వారి మ్యానిఫెస్టోలో ఉన్నాయి.