లూధియానా : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌తో పాటు ఉచిత వైద్యం, హెల్త్ కార్డు అందిస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. లూధియానాలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పంజాబ్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. పంజాబ్ పౌరులందరికీ ఆరోగ్య వసతులు కల్పిస్తామని, ఉచితంగా వైద్య చికిత్స, మందులు, ఆపరేషన్లు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
పౌరులందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 16,000 ప్రాంతాల్లో వార్డు క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను పునరుద్ధరిస్తామని, రోడ్డు ప్రమాద బాధితులందరికీ ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ తిరిగి ఆప్ గూటికి చేరతారా అన్న ప్రశ్నకు ఇది ఊహాజనిత ప్రశ్నని తోసిపుచ్చారు. రాష్ట్రానికి మేలు చేసే సీఎం అభ్యర్ధిని సరైన సమయంలో ప్రకటిస్తామని తెలిపారు.