అహ్మదాబాద్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ పర్యటనలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీలో ఉంటూనే బీజేపీ కార్యకర్తలు ఆప్ కోసం పనిచేయాలని కోరారు. బీజేపీ నుంచి పేమెంట్స్ అందుకుంటూ ఆ పార్టీ కార్యకర్తలు అంతర్గతంగా ఆప్ కోసం పనిచేయాలని పిలుపు ఇచ్చారు.
రాష్ట్రంలో తాము అధికారం లోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, దీంతో బీజేపీ కార్యకర్తలు లబ్ధి పొందుతారని అన్నారు. తమకు బీజేపీ నేతలు అవసరం లేదని, ఆ పార్టీ పన్నా ప్రముఖులు, గ్రామాలు, బూత్లు, తాలూకా స్ధాయి కార్యకర్తలు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. బీజేపీకి ఏండ్లుగా సేవలందిస్తున్న కార్యకర్తలకు ఆ పార్టీ తిరిగి ఏమిచ్చిందని ప్రశ్నించారు.
మీరు (బీజేపీ కార్యకర్తలు) ఆ పార్టీలోనే ఉండండి..అయితే ఆప్ కోసం పనిచేయండని కాషాయ పార్టీ కార్యకర్తలకు సూచించారు. బీజేపీ ఇచ్చే డబ్బు తీసుకుని తమ కోసం పనిచేయాలని, తమ పార్టీ వద్ద డబ్బు లేదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. గుజరాత్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం, ఉచిత విద్యుత్ అందచేస్తామని పునరుద్ఘాటించారు. బీజేపీ తమ కార్యకర్తలు, వారి కుటుంబాలకు ఈ సదుపాయాలు కల్పించడం లేదని తాము వారందరికీ వీటన్నింటినీ అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.