న్యూఢిల్లీ, డిసెంబర్ 16: అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీలో ప్రజారవాణా వ్యవస్థను ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తేవడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలను రేవడీ (తాయిలా)లంటూ ఎద్దేవా చేస్తున్న కేంద్ర సర్కారు ధోరణిని తప్పు పట్టారు. వాషింగ్టన్ నగరపాలక వ్యవస్థ కూడా తాయిలాలు పంచుతున్నదని దుయ్యబడదామా? అని కేజ్రీవాల్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ప్రజా రవాణా బస్సుల్లో ప్రజలకు పూర్తి ఉచితంగా సేవలు అందించాలని వాషింగ్టన్ నగరపాలక సంస్థ తీర్మానించడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ప్రజలకు ఉచిత సౌకర్యాలు కల్పించడంపై విపక్ష బీజేపీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.