న్యూఢిల్లీ : పంజాబ్లో భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ సర్కార్ ఇంటింటికీ రేషన్ డెలివరీ పధకాన్ని ప్రారంభించడంపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ తరహా పధకానికి కేంద్రం మోకాలడ్డుతోందని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం తొలుత దేశ రాజధానిలో ఈ పధకాన్ని అమలు చేయాలని కోరుకున్నా కేంద్రం అడ్డుపడిందని దుయ్యబట్టారు.
ఢిల్లీ తర్వాత పంజాబ్లో కొలువుతీరిన ఆప్ ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పంపిణీ పధకాన్ని సోమవారం ప్రకటించారని, ఈ పధకం అక్కడ త్వరలోనే అమలవుతుందని స్పష్టం చేశారు. గత నాలుగేండ్లుగా ఢిల్లీలో ఈ పధకాన్ని అమలు చేసేందుకు తాము పలు అడ్డంకులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తాము ఈ పధకం అమలుకు సన్నద్ధమైనా కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు.
పంజాబ్లో ఈ పధకాన్ని తాము అమలు చేస్తామని దీంతో మిగిలిన రాష్ట్రాలు ఈ పధకాన్ని డిమాండ్ చేస్తాయని చెప్పారు. మొహల్లా క్లినిక్ల తరహాలో ఈ పధకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చని అన్నారు. ఇక పంజాబ్లో రేషన్ డెలివరీ పధకాన్ని ప్రకటిస్తూ భగవంత్ మాన్ పేదలకు ఈ పధకం మేలు చేస్తుందని చెప్పారు. రేషన్ కోసం ఇక పేదలు క్యూల్లో నిల్చోవాల్సిన అవసరం ఉండదని వారి ఇంటికే సరుకులను చేరవేస్తామని తెలిపారు.