Karur stampede : మద్రాస్ హైకోర్టు (Madrass High Court) లో టీవీకే పార్టీ (TVK party) కి చుక్కెదురైంది. కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్పై శుక్రవారం మదురై బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా విజయ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
కరూర్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదని పేర్కొంది. ఈ సందర్భంగా కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ న్యాయవాది జీఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేసింది.
విచారణ సందర్భంగా రాజకీయ పార్టీలకు కోర్టు కీలక సూచనలు చేసింది. భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, ఆంబులెన్స్ సేవలు, నిష్క్రమణ మార్గాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. ప్రజల ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.