BJP | చెన్నై, ఆగస్టు 21: డీఎంకే వ్యవస్థాపకుడు ఎం కరుణానిధి శత జయంతి ఉత్సవాలు తమిళనాడు రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలపై ఊహాగానాలకు తెరతీశాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనూహ్యంగా దివంగత నేత కరుణానిధిపై పొగడ్తల జల్లు కురిపించడంతో కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పార్టీ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి.
డీఎంకే నేతలు కూడా పొగడని విధంగా రాజ్నాథ్ తమ నేతను ప్రశంసించారని స్టాలిన్ పేర్కొన్నారు. అయితే రాజ్నాథ్ చర్యతో రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య కొత్త పొత్తులకు దారితీస్తాయన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. బీజేపీతో స్టాలిన్ పొత్తు పెట్టుకుంటారని, చాలా ఏండ్లుగా కాంగ్రెస్తో ఉన్న మైత్రిని తెంచుకుని డీఎంకే ఈసారి బీజేపీతో అడుగులు వేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పటివరకు డీఎంకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ బంధం ఇలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నది.