Finance Minister | కర్ణాటక హక్కులను తాము ఎప్పుడూ ఉల్లంఘించలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందని విమర్శించారు. పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి రూ.2లక్షలకోట్లకుపైగా ఇచ్చామని.. యూపీఏ పాలనలో కేవలం రూ.81వేలకోట్ల బడ్జెట్‌ను మాత్రమే ఇచ్చిందన్నారు. బెంగళూరులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కర్ణాటకకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో ఎవరికీ లాభం లేదన్నారు. ఢిల్లీలో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో 2004 నుంచి 2014 పదేళ్లలో కర్ణాటకకు రూ.81,791 కోట్లు మాత్రమే అందాయని ఆర్థిక మంత్రి తెలిపారు.
2014 నుంచి 24 మధ్య ప్రధాని మోదీ ప్రభుత్వంలో రూ.2,95,818 కేటాయించిందని చెప్పారు. యూపీఏ కేవలం రూ.60,779 కోట్లను ఎయిడ్ గ్రాంట్‌గా ఇచ్చిందని చెప్పారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పదేళ్లలో రూ.2,39,955 కోట్ల గ్రాంట్ ఇచ్చిందన్నారు. బడ్జెట్లో ఉపాధి అనే పదాన్ని ఉపయోగించానన్నారు. ఇందులోని ప్రతి అక్షరానికి ఓ అర్థం ఉంటుందన్నారు. ఈ అంటే ఉపాధి అని.. ఎం అంటే మధ్యతరగతి అని.. ఇలా ప్రతి అక్షరానికి కొంత అర్థం ఉంటుందన్నారు. బడ్జెట్లో యువత, ఎంఎస్ఎంఈలకు పెద్దపీట వేశామన్నారు. ఉన్నత విద్య కోసం రుణం సైతం ఇస్తున్నామన్నారు. నేరుగా మధ్య తరగతి కుటుంబాలకు, భారత్‌లో చదువుతున్న యువతకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు.