ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ జరగనున్న నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసుల విచారణ చేసేందుకు వీలు లేకుండా సీబీఐకి సాధారణ సమ్మతిని గురువారం ఉపసంహరించుకుంది. సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సాధారణ సమ్మతి ఉపసంహరించుకున్న కాంగ్రెస్ సర్కారు
గవర్నర్‌కు సమాచారం అందకుండా జాగ్రత్తలు
Karnataka | బెంగళూరు, సెప్టెంబర్ 26: ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ జరగనున్న నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసుల విచారణ చేసేందుకు వీలు లేకుండా సీబీఐకి సాధారణ సమ్మతిని గురువారం ఉపసంహరించుకుంది. సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ ప్రకటించారు.
సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నప్పటికీ కేసును బట్టి సీబీఐ విచారణకు సమ్మతిస్తామని తెలిపారు. ముడా స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ ద్వారానే విచారణ జరిపించాలని ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణతో పాటు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం హైకోర్టును ఆశ్రయిస్తానని స్నేహమయి కృష్ణ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవడం ద్వారా రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా ప్రభుత్వం తలుపులు మూసేసింది.
మంత్రివర్గ అనుమతి తర్వాతే గవర్నర్ వద్దకు..
ఇక నుంచి మంత్రివర్గ సమ్మతి తర్వాతనే గవర్నర్‌తో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులను మంత్రివర్గం ఆదేశించింది. పలు అంశాలపై తనకు వివరాలు పంపించాల్సిందిగా ఇటీవల సీఎస్‌కు గవర్నర్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గవర్నర్ అడిగే వివరాలను ముందుగా మంత్రివర్గానికి సమర్పించి, మంత్రివర్గ నిర్ణయాన్ని అనుసరించి గవర్నర్‌కు వివరాలను పంపించాలని అధికారులకు సూచించినట్టు హెచ్‌కే పాటిల్ తెలిపారు.
గోద్రా అల్లర్ల తర్వాత మోదీ రాజీనామా చేశారా?
తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రధాని మోదీ 2002లో గోద్రా అల్లర్ల తర్వాత రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. సిద్ధరామయ్య రాజీనామా చేయాలని విధాన సౌధ వద్ద బుధవారం బీజేపీ చేసిన నిరసనపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సిద్ధరామయ్య తప్పుకోవాల్సిందే
ముడా కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సొంత పార్టీ నుంచే మరో ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు, మాజీ స్పీకర్ కేబీ కొలివాడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సూచించారు. ఈ కేసులో విచారణను ఎదుర్కోవాలని సిద్ధరామయ్యకు స్పష్టంచేశారు. విచారణ తర్వాత ఆయన మళ్లీ సీఎం కావొచ్చని పేర్కొన్నారు. విపక్ష బీజేపీ, జేడీఎస్‌లు కుమ్మక్కై సిద్ధూను పదవి నుంచి దించడానికి ఒక ప్రైవేట్ వ్యక్తితో ఫిర్యాదు చేయించారని కొలివాడ్ ఆరోపించారు.