Karnataka | బెంగళూరు, ఫిబ్రవరి 19: గ్యారెంటీలంటూ అలివికాని హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటిని అమలుచేయకపోగా, ప్రశ్నిస్తున్న గొంతులపైనే విరుచుకుపడుతున్నది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రెండు మూడు నెలల నుంచి అన్న భాగ్య, గృహలక్ష్మి పథకాలకు సంబంధించిన మొత్తాలను కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించడం లేదు. మంగళవారం చిత్రదుర్గలో మంత్రి కేజే జార్జిని మీడియా దీనిపై ప్రశ్నించింది. ‘లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు ప్రతి నెలా నగదు బదిలీ చేస్తున్నాం. అప్పుడప్పుడు కొంత ఆలస్యం జరగవచ్చు. ఇదేమీ నెల జీతం కాదు, ఠంచన్‌గా ఖాతాల్లో పడటానికి’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పథక లబ్ధిదారుల పట్ల మంత్రి వైఖరిని అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత ఆర్ అశోక తప్పుబట్టారు. ఓటర్లకు మంత్రి ఇచ్చే గౌరవమిదేనా? వారు అన్న భాగ్య, గృహ లక్ష్మి గురించి మిమ్మల్ని అడుక్కోవడం లేదు. అయినా ప్రజలేమన్నా ఈ పథకాలు పెట్టమని మిమ్మల్ని ప్రాధేయ పడలేదు కదా? అని ఆయన అన్నారు. ‘మీరు వాటిని అమలు చేయాలనుకుంటే గౌరవంగా అమలు చేయండి. లేకపోతే దిగిపోండి. ప్రజలు ఈ పథకాలు రాకముందూ బతికారు, ఆ పథకాలు లేకపోయినా బతుకుతారు’ అని దుయ్యబట్టారు.