(స్పెషల్ టాస్క్ బ్యూరో)
MUDA Scam | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ముడా కుంభకోణంలో అక్రమాలు జరిగాయని ఇదివరకే ప్రకటించిన ఈడీ తాజాగా మనీలాండరింగ్ ప్రయత్నాలు కూడా జరిగినట్టు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా సీఎం సిద్ధరామయ్య, ఆయన సతీమణి బీఎం పార్వతితో పాటు మరికొందరు కుటుంబసభ్యులు, అలాగే ముడాలో పనిచేసిన అప్పటి కీలక అధికారుల పేర్లను కూడా చేర్చింది. ఈ మేరకు గురువారం ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్ (పీఏవో)లో వెల్లడించింది.
ఈడీ పీఏవో నివేదిక ప్రకారం.. సిద్ధరామయ్య భార్యకి కట్టబెట్టిన 14 సైట్లలో నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఖరీదైన స్థలాలను కాజేయడంలో భాగంగా మనీలాండరింగ్ ప్రయత్నాలు జరిగాయి. భూములను కాజేయడానికి సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేశారు. సంతకాలను ఫోర్జరీ చేశారు. ప్రజావసరాల కోసం అప్పటికే సేకరించిన భూమిని నోటిఫికేషన్ రద్దు పేరిట దారిమళ్లించారు. సిద్ధరామయ్య కుటుంబసభ్యులకు లబ్ధి చేయడానికే ఇదంతా చేసినట్టు తమ విచారణలో తేలిందని ఈడీ తెలిపింది.