Fisherman | చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సముద్రంలో చేపలు పడుతుండగా ఎగిరొచ్చిన ఒక చేప అతడి కడుపులో లోతుగా పొడిచింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అతను ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని కార్వర్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కార్వర్‌కు చెందిన మత్స్యకారుడు అక్షయ అనిల్ మజలికర్ (24) అక్టోబర్ 14వ దీన తన బృందంతో కలిసి అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. ఆ సమయంలో బోటు అంచన అక్షయ అనిల్ కూర్చున్నాడు. అదే సమయంలో నీళ్లలో నుంచి ఎగిరి వచ్చిన ఒక చేప.. తన సూదిలాంటి నోటితో అనిల్‌ను పొడిచింది.
అనిల్‌ను పొడిచిన చేపను కందె రకమని చెబుతున్నారు. ఈ చేప నోరు 8 నుంచి 10 అంగుళాల పొడవుతో మొనదేలి ఉంటుంది. అందువల్లే సముద్రంలోని నీటిలో ఎగిరిన చేప ప్రమాదవశాత్తూ.. అనిల్ కడుపులో గుచ్చుకుంది. దీనివల్ల అనిల్ పేగులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల కారణంగా తీవ్ర రక్తస్రావం కావడంతో అనిల్‌ను వెంటనే ఒడ్డుకు తీసుకొచ్చి కార్వర్లోని క్రిమ్స్ (KRIMS) ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స అందించారు. అయితే రెండు రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం కన్నుమూశాడు. కాగా, అనిల్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితుడు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.