రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా ప్రబలుతుంటే కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరిన వీడియోపై బీజేపీ విమర్శలు గుప్పించింది. నగరాలు నీటి కుంటలు, అపరిశుభ్రతతో నిండిపోయి, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విజృంభిస్తుంటే పేదలకు అనుకూలమైన కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛమైన స్విమ్మింగ్ పూల్‌లో తేలియాడుతోందని బీజేపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది.
మంత్రి స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన బీజేపీ ఈ వీడియోకు నీటిలో విహరిస్తున్న ఆరోగ్య శాఖకు చెందిన నీరో రావు అని క్యాప్షన్ ఇచ్చింది. బీజేపీ పోస్ట్‌పై మంత్రి దీటుగా బదులిచ్చారు. స్విమ్మింగ్, ఎక్సర్సైజ్ తన దినచర్యలో భాగమని, బీజేపీ నేతలు కూడా వ్యాయామం చేయాలని సూచించారు. ఇది ఆరోగ్యానికి మంచిదే కాకుండా బుర్రకు కూడా పదును పెడుతుందని చెప్పారు.
మీరూ స్విమ్మింగ్ చేస్తే ఇలాంటి అసత్యాలు, దారిమళ్లించే ఎత్తుగడలకు పాల్పడరని చురకలు అంటించారు. రాష్ట్రంలో డెంగ్యూ ప్రబలడం ఆందోళన రేకెత్తిస్తోందని, తాను మంగళూర్‌కు చేరుకోగానే డెంగ్యూ పరిస్ధితిపైనే ముందుగా అధికారులతో సమీక్షించానని మంత్రి పేర్కొన్నారు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంత్రి వీడియో మంగళూర్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్‌లో రికార్డు చేశారు.
Read More :
DSC | నిరసనలు తెలిపేందుకు అవకాశమివ్వండి.. పోలీసు కాళ్లు మొక్కిన ఓ నిరుద్యోగి.. వీడియో