HMPV : కరోనా వైరస్ (Corona Virus) కు పుట్టినిల్లు అయిన చైనాలో పుట్టిన మరో వైరస్ హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (Human Meta Pneumo Virus) భారత్‌లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి (Baptist hospital) లో 3, 8 నెలల చిన్నారులకు ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి సోమవారం ఉదయం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. కాగా, హ్యూమన్ మెటా న్యూమోవైరస్ను మొదట 2001లో గుర్తించారు. 2011-12లో అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి.
హెచ్ఎంపీవీ వైరస్ సోకితే దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారి తీయొచ్చు. సాధారణంగా వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుంపరల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది.
వైరస్ సోకిన వారినిగానీ, వైరస్‌తో కలుషితమైన వస్తువులనుగానీ తాకి.. ఆ చేతులతో ముక్కు, మూతి, కళ్లను తాకితే వైరస్ సోకుతుంది. పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి హెచ్ఎంపీవీ ముప్పు అధికంగా ఉంటుంది. తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరుకు టిష్యూ లేదా కర్చీఫ్‌ను అడ్డుపెట్టుకోవాలి. అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం కావడం మంచిది.
#WATCH | Bengaluru, Karnataka: Karnataka Health Minister Dinesh Gundu Rao chairs Emergency Meeting after symptoms of HMPV were found in 2 cases as per the Health Ministry
(Source: Health Department) pic.twitter.com/62JAR30atE
— ANI (@ANI) January 6, 2025