బెంగళూరు : కర్ణాటకలో కార్మికులు, ఉద్యోగులు రోజుకు 10 గంటలు పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పని వేళలను రోజుకు 12 గంటల వరకు అనుమతించాలని పేర్కొంది. ఈ మేరకు దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం, 1961ని సవరించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 9 గంటల షిఫ్ట్ అమలులో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం బుధవారం వ్యతిరేకించింది. పని గంటల పెంపును నిరసిస్తూ శ్రామిక వర్గమంతా కలిసిరావాలని కోరింది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, త్రైమాసిక ఓవర్‌టైమ్ పరిమితి ప్రస్తుత 50 గంటల నుంచి 144 గంటలకు పెరుగుతుందని వార్తా కథనాలు వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ఉద్యోగులు, కార్మికులు పని చేసే ఒక షిఫ్ట్ సమయాన్ని రోజుకు 9 గంటల నుంచి 10 గంటలకు పెంచాలని ప్రతిపాదించింది. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నది.
పని గంటల పరిమితిని పెంచడం గురించి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలను కోరిందని, దీనికి అనుగుణంగానే ఈ ప్రతిపాదన చేశామని కర్ణాటక కార్మిక శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ కూడా ఇదే విధంగా నిర్ణయాలు తీసుకున్నాయని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం స్పందిస్తూ, ఈ ప్రతిపాదన అమలైతే, కంపెనీలు రోజుకు మూడు షిఫ్ట్‌లకు బదులుగా రెండు షిఫ్ట్‌లను పెడతాయని, మూడింట ఒక వంతు మంది ఉద్యోగులను తొలగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. పారిశ్రామిక రంగానికి చెందినవారితో రాష్ట్ర కార్మిక శాఖ బుధవారం సమావేశాన్ని నిర్వహించి, ఈ ప్రతిపాదనల గురించి వివరించిందని చెప్పింది. తమ సంఘం ప్రతినిధులు ఈ సవరణలను పూర్తిగా వ్యతిరేకించారని తెలిపింది. పని గంటల పెంపు అంటే, ఉద్యోగులు, కార్మికుల వ్యక్తిగత జీవిత హక్కుపై దాడి చేయడమేనని పేర్కొంది.