Karnataka | హైదరాబాద్, జూలై 6 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కర్ణాటకలో ఎన్నికల ముందు ఎడాపెడా హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇప్పుడు వాటి అమలుకు నిధులు లేక నీళ్లు నములుతున్నది. ఇచ్చిన 5 గ్యారెంటీలను అమలు చేయడానికి కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఆపసోపాలు పడుతున్నది.
హామీల అమలుకు సరిపడా నిధులు లేకపోవడంతో చివరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై సిద్ధరామయ్య ప్రభుత్వం కన్నేసింది. రూ.14,730 కోట్ల సబ్‌ప్లాన్ నిధులను గ్యారెంటీల అమలుకు వాడుకోవాలని సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉచిత విద్యుత్తు, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెలా ఉచిత బియ్యం హామీల అమలుకు ఏడాదికి రూ. 53 వేల కోట్ల ఖర్చవుతుందని అంచనా. అయితే, ఖజానాలో సరిపడినన్ని నిధులు లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఖర్చు చేయాల్సిన రూ.39 వేల కోట్ల నిధుల్లో రూ.14 వేల కోట్లతో (37 శాతం) వీటిని నెరవేర్చాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది.