హైకోర్టులో కర్ణాటక ప్రభుత్వ వాదన
బెంగళూరు, ఫిబ్రవరి 18: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి ఏమీ కాదని కర్ణాటక హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హిజాబ్ వివాదంపై హైకోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. కర్ణాటక ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ప్రభులింగ్ నావద్గీ కోర్టు ముందు హాజరయ్యారు. ఇస్లాం మతాచారాల ప్రకారం హిజాబ్ తప్పనిసరి అంశమేమీ కాదని చెప్పారు. దాని ఉపయోగాన్ని అడ్డుకోవడం రాజ్యాంగంలోని 25వ అధికరణంలో తెలిపిన మతస్వేచ్ఛను ఉల్లంఘించడం కిందకు రాదని అన్నారు. హిజాబ్‌పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 5న జారీచేసిన ఆదేశాలు ముస్లిం మహిళల హక్కులను భంగపరుస్తున్నాయని అనడం మతోన్మాదం కిందకే వస్తుందని పేర్కొన్నారు. ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
కర్ణాటకలో ముస్లిం విద్యార్థుల డాటా సేకరణ!
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోని ముస్లిం విద్యార్థుల వివరాలు సేకరించే ప్రక్రియను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఓ పత్రిక నివేదించింది. డాటా సేకరణ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు కాలేజీల అడ్మినిస్ట్రేటివ్ హెడ్లు చెప్పిన విషయాలను వార్తాప్రతిక ఈ సందర్భంగా ఉటంకించింది. రాష్ట్రంలో హిజాబ్ వివాదం నేపథ్యంలో డాటా సేకరణ చర్చనీయాంశంగా మారింది. డాటాను వినియోగించుకొని కాలేజీల ఏరియాలను ‘సున్నిత ప్రాంతాలు’గా ముద్ర వేసే అవకాశం ఉన్నదని ఓ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపల్ పేర్కొన్నారు. గోప్యత హక్కుల ఉల్లంఘనలను ప్రభుత్వం కొనసాగిస్తున్నదని సీఐఎస్ సీనియర్ పాలసీ మేకర్ పల్లవి బేడి విమర్శించారు.