Karnataka | బెంగళూరు, ఫిబ్రవరి 6 : ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక ప్రజలపై రోజుకో భారం విధిస్తున్నది. అడ్డగోలుగా చార్జీలు పెంచేస్తున్నది. తాజాగా బర్త్, డెత్ సర్టిఫికెట్ల రేట్లను ఏకంగా 10 రెట్లు పెంచింది. బర్త్ సర్టిఫికెట్ రేట్‌ను రూ.5 నుంచి రూ.50కు, డెత్ సర్టిఫికెట్ రేట్‌ను రూ.2 నుంచి రూ.20కు పెంచింది. ఇది ఫిబ్రవరి 4 నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వులిచ్చింది. అలాగే మెట్రో రైలు చార్జీలను కూడా పెంచుతున్నట్టు తెలిపింది. ఇప్పటివరకు జననం, మరణం సంభవించిన 21 రోజుల్లో నమోదు చేస్తే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా ఇచ్చేవారు. అయితే ఇక నుంచి 21 నుంచి 30 రోజుల్లో దరఖాస్తు చేస్తే గతంలో వసూలు చేసే ఐదుకు బదులుగా రూ.20 వసూలు చేస్తారు. అలాగే 30 రోజుల తర్వాత ఐదు కాపీల జనన ధ్రువీకరణ పత్రాలకు గతంలో 25 వసూలు చేసేవారు. ఇప్పుడు దానిని 250కు పెంచారు. సర్టిఫికెట్ చార్జీల పెంపును బీజేపీ నేత బసన్నగౌడ పాటిల్ యత్నాల్ ఖండించారు. కాంగ్రెస్ పెట్టిన ఉచితాల భారాన్ని ఇలా చార్జీల బాదుడుతో సిద్ధరామయ్య సర్కార్ ప్రజలపై మోపుతున్నదని, వచ్చే ఎన్నికల్లో ఓటేసే సమయంలో పౌరులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
బెంగళూరు మెట్రోరైలు చార్జీలను పెంచుతూ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ గురువారం నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం శివకుమార్ వెల్లడించారు. చార్జీల పెంపు నిర్ణయం మెట్రో కమిటీ సిఫారసు మేరకు జరిగిందని, ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదన్నారు. నీటి చార్జీల పెంపు ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. 14 ఏండ్లుగా నీటి చార్జీలు పెంచకపోవడంతో బోర్డుపై ఏడాదికి వెయ్యి కోట్ల భారం పడుతున్నదన్నారు.