Karnataka | హైదరాబాద్, జూన్ 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అలవిగాని ఐదు గ్యారెంటీలను ప్రకటించి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది. హామీల కోసమని ఇప్పటికే ప్రజలపై పన్నులవాత మొదలు పెట్టిన సిద్ధరామయ్య సర్కారు.. ప్రభుత్వ ఆదా యం పెంచడానికి అమెరికాలోని బోస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న బోస్టన్ ప్రైవేటు కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) గడప తొక్కిం ది. 5 గ్యారెంటీలకు, ఇతరత్రా ప్రాజెక్టుల వ్యయానికి అవసరమైన నిధులు ఎలా రాబట్టాలో సలహాలు ఇవ్వాలని మొరపెట్టుకొంటున్నది. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఐదు గ్యారెంటీల ప్రచారంతో ఊదరగొట్టిన కాంగ్రెస్.. ఎట్టకేలకు కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది.
అయితే, ఈ హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.50-60 వేల కోట్ల భారం పడుతున్నది. దీంతో గ్యారెంటీల అమలుకు అయ్యే వ్యయాన్ని తగ్గించుకోడానికి ఇప్పటికే చార్జీల పెంపు, పన్ను వసూళ్లను సర్కారు మొదలుపెట్టింది. అయినప్పటికీ, హామీల అమలుకు అవసరమైన నిధులు చాలట్లేదు. దీంతో ఆదాయాన్ని పెంచే సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ గత మార్చిలో రాష్ట్ర ఆర్థిక శాఖ పలు ప్రైవేటు సంస్థల నుంచి ఈవోఐ(ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్)లను ఆహ్వానించింది. బీసీజీతో పాటు కేపీఎంజీ, ఈ అండ్ వై సంస్థలు పోటీలో నిలవగా, చివరకు బీసీజీ ఈ ప్రాజెక్టుకు ఎంపికైంది. అయితే, ఆరు నెలలపాటు సూచనలు చేయడానికి బీసీజీకి కర్ణాటక ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజు రూ.9.5 కోట్లు. ఈ మేరకు ఇంగ్లీష్ న్యూస్ వెబ్సైట్ ‘మనీ కంట్రోల్’ ఓ కథనంలో వెల్లడించింది.
ఆదాయ పెంపు సలహాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థపై ఆధారపడటమే కాకుండా, దీని కోసం పెద్దమొత్తంలో చెల్లించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అపార అనుభవం ఉన్న ఐఏఎస్‌లను కాదని, పెద్దమొత్తం చెల్లించి ఓ ప్రైవేటు కంపెనీపై సర్కారు ఆధారపడటం సమంజసం కాదని రిటైర్డ్ ఐఏఎస్ ఎంజీ దేవసహాయం అభిప్రాయపడ్డారు. ప్రైవేటు కంపెనీలు ఎక్కువ ఫీజును వసూలు చేయడమే గాక, అవి ఇచ్చే రిపోర్టులు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉంటాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ఉచిత హామీలు ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారాయన్నారు.
5 గ్యారెంటీల్లో ‘ఉచిత విద్యుత్తు’ హామీని ఇచ్చినట్టే ఇచ్చి ఛార్జీల పెంపునకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసింది. మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామన్న ‘గృహలక్ష్మి’ స్కీమ్‌కు కొత్త ఆంక్షలు జోడించింది. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన ‘శక్తి’ స్కీమ్‌లో వయసు, వృత్తి అంటూ కొత్త పరిమితులు తెచ్చింది. బస్సు సర్వీసులను తగ్గించింది. నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న ‘యువనిధి’, పేదలకు ఉచిత బియ్యమన్న ‘అన్నభాగ్య’ ఇలా ప్రతీ స్కీమ్‌లోనూ కోతలు విధిస్తున్నది. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇకచేసేదేమీలేక, హామీల అమలుకు అవసరమైన నిధులను ప్రజల నుంచే పిండుకోవాలని ట్యాక్స్‌ల వాతపెట్టిన సర్కారు.. చివరకు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాల కోసం బోస్టన్ కంపెనీని ఆశ్రయించింది.