సిర్పూర్(టి), ఏప్రిల్ 21 : మండలకేంద్రంతో పలు గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బస్టాండ్ ప్రాంతంలోని పలు కాలనీల్లో వరద నీరు ప్రవహించగా, కొన్ని గ్రామాల్లో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని జడ్పీ హైస్కూల్ సమీపంలోని ఓ చెట్టుపై పిడుగుపడడంతో మంటలు చెలరేగాయి. సమీపంలో ఇండ్ల సముదాయాలు లేకపోవడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
కౌటాల, ఏప్రిల్ 21: మండల కేంద్రంలో భారీ గాలి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. తలోడి పంచాయతీలోని ధనూర్హెట్టిలో చెట్లతో పాటు విద్యుత్ స్తంభం నేలకూలింది. జొన్న పంటలు ధ్వంసమయ్యాయి.
దహెగాం, ఏప్రిల్ 21 : మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. గిరివెల్లి, చంద్రవెల్లి, కుంచవెల్లి, ఒడ్డుగూడ, లగ్గాం, కమ్మరపెల్లి, దహెగాం, అత్తిని, పీపీరావ్ కాలనీ, కల్వాడ, తదితర గ్రామాల్లోని కల్లాలోని వరిధాన్యం తడిసి ముద్దకాగా, కోత దశలో ఉన్న వరి పంట నేలకొరిగింది. మండలంలో సుమారుగా 3 వేల ఎకరాలు వరి పంటలను రైతులు నష్టపోయారు.
ఆసిఫాబాద్టౌన్, ఏప్రిల్ 21 : జిల్లా కేంద్రంలో బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు వర్షంతో ప్రజలు ఊరట చెందారు.