బెంగళూరు, మార్చి 24: మతపరమైన రిజర్వేషన్లను కల్పించడం కోసం రాజ్యాంగాన్ని మారుస్తామంటూ వ్యాఖ్యానించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ ‘మంచి రోజులు వస్తాయి. చాలా మార్పులు జరుగుతాయి. రాజ్యాంగం మారుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం రాజుకుంది. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తన మాటలను బీజేపీ వక్రీకరించిందని డీకే శివకుమార్ సోమవారం వివరణ ఇచ్చారు.
డీకే వ్యాఖ్యలు సోమవారం పార్లమెంట్ ఉభయ సభలలో రభసకు దారితీశాయి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యుల నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలని భావిస్తోందని బీజేపీ సభ్యులు ఆరోపించారు.