DK Shiva Kumar : కర్ణాటక (Karnataka) డిప్యూటీ సీఎం (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) గురువారం అసెంబ్లీలో ‘నమస్తే సద వత్సలే మాతృభూమి’ అంటూ ఆరెస్సెస్ గీతాన్ని ఆలపించాడు. దాంతో ఆయన బీజేపీ (BJP) లో చేరతారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో డీకే ఆ ప్రచారానికి తెరదించారు. తాను పుట్టుకతోనే కాంగ్రెస్ వాడినని, జీవితాంతం ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు.
డీకే శివకుమార్ శుక్రవారం విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీ లేదా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తో చేతులు కలిపే ప్రసక్తే లేదని అన్నారు. తాను నికార్సయిన కాంగ్రెస్ వాడినని వ్యాఖ్యానించారు. తన జీవితం, తన రక్తం అన్నీ కాంగ్రెస్ పార్టీకే అంకితమని చెప్పారు. ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న తాను, ఒక మూలస్తంభంలా అండగా నిలుస్తానని అన్నారు.
ఆరెస్సెస్ గీతం పాడటం గురించి ప్రశ్నించగా.. తాను జనతాదళ్, బీజేపీ గురించి ఎలా అధ్యయనం చేశానో, అలాగే ఆర్ఎస్ఎస్ గురించి కూడా తెలుసుకున్నానని డీకే శివకుమార్ చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీపై తనకు అవగాహన ఉందన్నారు. క్షేత్రస్థాయిలో తాలూకా, జిల్లా కేంద్రాల్లో విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తూ ఆర్ఎస్ఎస్ తనను ఎలా బలోపేతం చేసుకుంటుందో తనకు తెలుసని చెప్పారు. రాజకీయంగా తమ మధ్య భేదాభిప్రాయాలు ఉండవచ్చునని, కానీ ఒక నాయకుడిగా తన ప్రత్యర్థుల్లో ఎవరు తనకు మిత్రులో, ఎవరు తనకు శత్రువులో తెలుసుకోకుండా ఉండలేను కదా?’ అన్నారు.
అందుకే తాను ఆర్ఎస్ఎస్ చరిత్రను కూడా చదివానని, కొన్నిసార్లు మన ప్రత్యర్థుల్లో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయని, వాటిని మనం గమనించాలని, తాను అదే చేశానని డీకే శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతల ధర్మస్థల యాత్రపై స్పందిస్తూ.. బీజేపీ ఒక బలహీనపడిన శక్తని, వారు చేస్తున్నదంతా కేవలం రాజకీయమేనని విమర్శించారు. అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌పై ఆరోపణలు చేసిన కార్యకర్త మహేశ్ శెట్టి తిమరోడి అరెస్టును ఆయన సమర్థించారు.
రాజకీయాల్లో ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని డీకే అన్నారు. ప్రత్యర్థులైనా సరే వారి ఆత్మగౌరవానికి భంగం కలగకూడదని చెప్పారు. ఈ రోజు వారిపై మాట్లాడిన వారు, రేపు మనపై కూడా మాట్లాడవచ్చునని, కాబట్టి అలాంటి వాటిని సమర్థించకూడదని అన్నారు.