బెంగళూరు, నవంబర్ 5: తన సీనియర్లు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు హెబ్బాల్కర్ ప్రైవేట్ సెక్రటరీ తనకు చేసిన అన్యాయమే తన చావుకు కారణమని కర్ణాటకలో ఓ ప్రభుత్వ ఉద్యోగి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. మృతుడిని తహసిల్దార్ ఆఫీసులో సెకండ్ డివిజన్ అసిస్టెంట్ రుద్రన్న యాదవన్నగా గుర్తించారు. తహసిల్దార్ బసవరాజు నాగరాల, మంత్రి పీఏ సోము తన చావుకు బాధ్యులని యాదవన్న ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్లో సందేశం పెట్టారు.
మంత్రి హెబ్బాల్కర్ ప్రైవేట్ సెక్రటరీ కారణంగా తాను చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు. ఆఫీసులో జరుగుతున్న అన్యాయాన్ని భరించలేకపోతున్నానని తెలిపారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఆఫీస్ సిబ్బంది సమైక్యంగా పోరాడాలని కోరారు. సీనియర్ అధికారుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని అతడు ఒక వీడియో రికార్డ్ చేసినట్టు ఉద్యోగ వర్గాలు తెలిపాయి.