బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ జీవితంపై ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య దీనిపై స్పందించారు. యతీంద్ర వ్యాఖ్యలను మీడియా వక్రీకరించి (ట్విస్ట్ చేసి) చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యతీంద్ర ఇటీవల మాట్లాడుతూ.. తన తండ్రి (సిద్ధరామయ్య) రాజకీయ జీవితం చివరి దశలో ఉన్నారని, ఆయన వారసుడు పీడబ్ల్యూడీ మంత్రి సతీశ్ జార్కిహోళి అని పేర్కొనడం వివాదానికి దారి తీసింది. ఈ వివాదంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. “అతడి ప్రకటనను వక్రీకరిస్తే నేను ఏం చేయగలను? అసలు ఏమి మాట్లాడావని నేను అతడిని అడిగాను. కేవలం సిద్ధాంతాల గురించి మాత్రమే మాట్లాడానని, ఎవరైనా ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చెప్పలేదని నాతో చెప్పాడు” అని వివరించారు.