Karnataka | బెంగళూరు, జనవరి 4: ప్రజలపై మరో అదనపు బాదుడుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రెండు రోజుల క్రితమే ఆర్టీసీ బస్ చార్జీలు పెంచిన సిద్ధరామయ్య ప్రభుత్వం తాజాగా మెట్రో రైల్ టికెట్ ధరల పెంపునకు రెడీ అవుతున్నది. 10 నుంచి 15 శాతం టిక్కెట్ చార్జీల పెంపు ఉండవచ్చునని భావిస్తున్నారు. శక్తి పథకం పేరుతో మహిళా ప్రయాణికులకు అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం భారాన్ని తగ్గించుకోవడానికి బస్సు చార్జీలను 15 శాతం పెంచుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కారు గురువారం నిర్ణయం తీసుకుంది.
2023లో గెలుపే లక్ష్యంగా ఎడాపెడా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తర్వాత వివిధ సేవల చార్జీలను కూడా ఎడాపెడా పెంచుతూ తమపై బారం మోపుతున్నదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, కొత్త వాహనాలపై అదనపు సర్ చార్జీలను పౌరుల నుంచి వసూలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచింది. త్వరలో పాల ధరలను కూడా పెంచుతామని ప్రకటించింది. ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ బెంగళూరులోని నమ్మ మెట్రో చార్జీల పెంపునకు సిఫార్సు చేసింది. 10-15 శాతం మేర మెట్రో చార్జీలను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
రాష్ట్రంలో గోవులను కాపాడే లక్ష్యంతో తాము ప్రారంభించిన గోశాల ప్రాజెక్టును రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని ప్రతిపక్ష బీజేపీ శనివారం ఆరోపించింది. గతంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 35 గోశాలలను మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేస్తోందని బీజేపీ ఆరోపించింది. గోవులను కాపాడటమంటే ఈ దేశ సంస్కృతిని కాపాడటమేనని ఎక్స్ వేదికగా బీజేపీ పేర్కొంది.