Karnataka | మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా భూముల కుంభకోణంపై విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో కీలక పరిణామం జరిగింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) సభ్యులు గురువారం సమావేశమై, 50:50 స్కీమ్‌లో కేటాయించిన భూములను ఉపసంహరించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. జస్టిస్ పీఎన్ దేశాయ్ కమిషన్ రిపోర్టు వచ్చిన తర్వాత దీనిని అమలు చేయాలని నిర్ణయించారు.
ముడా చైర్మన్ పదవికి కే మారిగౌడ గత నెల 16న రాజీనామా చేయడంతో డిప్యూటీ కమిషనర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతి నుంచి ముడా సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా 50:50 స్కీమ్ ప్రకారం ఆమెకు తిరిగి ఇచ్చిన స్థలాల విషయంలో ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
చట్టవిరుద్ధంగా కేటాయించిన స్థలాలను ఉపసంహరించనున్నట్లు మైసూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హెచ్‌సీ మహాదేవప్ప ఈ నెల 1న సంకేతాలు ఇచ్చారు. ముడా భూముల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ దేశాయ్ కమిషన్ డిసెంబర్లో నివేదిక ఇచ్చే అవకాశముంది.
ముడా స్థలాల కేటాయింపులపై దర్యాప్తులో భాగంగా సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం ఉందని ఆయన న్యాయ సలహాదారు ఏఎస్ పొన్నన్న చెప్పారు. దర్యాప్తు అధికారులు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు పిలిచి, ప్రశ్నించవచ్చునని తెలిపారు. సిద్ధూను లోకాయుక్త పోలీసులు బుధవారం ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం పదవికి తాను రాజీనామా చేయబోనని సిద్ధరామయ్య మరోసారి తెలిపారు.
కర్ణాటకలో కాంగ్రెస్‌ను నిర్మూలించాలనే భారీ వ్యూహంతోనే బీజేపీ తనపై దృష్టి పెట్టిందని సిద్ధరామయ్య గురువారం ఆరోపించారు. ‘బీజేపీ వాళ్లు ఐటీ, ఈడీని దుర్వినియోగం చేసి నాపై, నాగేంద్రపై తప్పుడు కేసులు పెట్టించారు. బీజేపీని విమర్శించే వారిని నిర్మూలించేందుకు ఆ పార్టీ ఎంత దూరమైనా వెళ్తుంది. మోదీ, అమిత్ షాను విమర్శిస్తున్నందుకే నన్ను నాశనం చేయాలనుకుంటున్నారు. సిద్ధరామయ్యను అంతం చేస్తే కర్ణాటకలో కాంగ్రెస్‌ను అంతం చేయొచ్చనేది వారి ఆలోచన.’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.